బాబుకు అవమానంపై మండిపడ్డ నటులు

Telugu Online(TOL)- Andhra Pradesh Political News - July.21.2010: సామరస్యం, దేశభక్తికీ పెట్టింది పేరుగా ఉండే మహారాష్ట్ర ప్రతిష్టను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు హరికృష్ణ నేరుగా చవాన్ కు ఓ లేఖ రాశారు.
దొంగతనంగా తెలుగువారి జల సంపదను దోచుకునేందుకు వేసిన ఎత్తులను మానుకుని అక్రమ ప్రాజెక్టులన్నిటినీ తొలగించాలని సూచించారు. తెలుగు నేతల అరెస్టుతో తెలుగువారు ఉగ్రసింహాలై మీపైకి ఉరకక ముందే మేలుకొని తప్పును సరిదిద్దుకోమని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా హరికృష్ణ విరుచుక పడ్డారు. తెలుగువారికి అవమానం జరుగుతున్నా కళ్లు మూసుకుని కూచున్న కాంగ్రెస్ పార్టీకి చేటు కాలం దాపురించిందన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సినీ నటుడు మోహన్ బాబు కూడా రాజకీయాలకు అతీతంగా స్పందించారు. తెలుగువారిపై మరాఠా పోలీసులు అమానుషంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. బాబ్లీ ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన తెలుగు బిడ్డలపై మరాఠీ సర్కారు దౌర్జన్య చర్యలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబ్లీ సమస్య ప్రతి ప్రతి తెలుగోడి సమస్య అని, తెలుగు ప్రజలు హృదయపూర్వకంగా స్పదించాలని అన్నారు. మహారాష్ట్ర పోలీసులు తెదేపా నేతలపై లాఠీఛార్జీ చేసినప్పుడు తన హృదయం ఆవేదనతో రగిలిపోయిందని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతల పట్ల మహారాష్ట్ర పోలీసుల వైఖరికి నిరసనగా సినీ నటుడు మోహన్ బాబు మంగళవారం వందలాది మంది విద్యార్థులతో రంగంపేట నుంచి తిరుపతి వరకు ర్యాలీగా బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా యాత్ర చేపట్టవచ్చునని, ఇందుకు అనుమతి అక్కర్లేదని అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల పట్ల వ్యవహరించిన తీరుకు మండిపడ్డ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు వాడి దమ్ము, పౌరుషం ఏమిటో చూపిద్దామని పిలుపునిచ్చారు. కేంద్రంలోనూ, రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉన్నందున కాంగ్రెసుకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం మరోసారి ప్రమాదంలో పడిందన్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు కూడా తాము వారసులమని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని అన్నారు.
|
|
|