
Telugu Online(TOL)- Andhra Pradesh Political News - July.22.2010: చంద్రబాబునాయుడి బాబ్లియాత్ర వ్యవహారం జాతీయస్థాయిలో క్షీణించిన చంద్రబాబు ప్రాభవానికి, పలుకుబడికి అద్దం పడుతోంది. చంద్రబాబు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన నాయకుడు కాదు. ఒకప్పుడు జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పడమే గాక, ప్రధానుల్ని కూడా డిసైడ్ చేసిన వ్యక్తి. జతీయస్థాయి పార్టీలతో పొత్తులు సాగించి కాంగ్రెస్ పై కత్తులు దూసిన రాజకీయ మేధావి. అయితే అటువంటి చంద్రబాబు నాలుగురోజులపాటు పొరుగురాష్ట్రంలో పోలీసు నిర్బంధంలోఉంటే కనీసం జాతీయస్థాయిలో చర్చనీయాంశం కాకపోవడం స్వయంగా టీడీపీ నేతల్ని సైతం హతాశుల్ని చేసింది.
వామపక్షాల్లో కూడా స్థానికంగా కదలిక, మద్దతు వచ్చాయే తప్ప జాతీయస్థాయిలో ఎవ్వరూ బాబు బృందం నిర్బంధంపై స్పందించిన దాఖలాలు లేవు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ నేతలు మరింత లోకువగా, చులకనగా కనిపించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా మహారాష్ట్ర సీఎం ఆగడంపై మౌనంగా ఉండడానికి కారణం జాతీయ స్థాయిలో బాబు అనామకునిగా మారడమే అంటున్నారు. అసలీ బాబ్లీ యాత్రను ఇంత హడావుడిగా కాకుండా అన్ని విపక్షాల మద్దతుతో చేసి ఉండాల్సిందని అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా తగినంత ముందుగా చెప్పి విస్తారమైన ప్రచారంతో వెళితే ఈ అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయ్యుండేదని పరిశీలకులు భావిస్తున్నారు. అపుడు రాష్ట్రంలో కూడా బాబుకు ఇప్పటికంటే మద్దతు పెరిగి ఉండేదని భావిస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీతో బాబు తెచ్చిపెట్టుకున్న వ్యతిరేకత ఈ యాత్రపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. లేకుంటే జాతీయస్థాయిలో ఈ యాత్ర అంశాన్ని బీజేపీ నాటకీయంగానైనా వాడుకొని కాంగ్రెస్ ను ఇరుకున పెట్టి ఉండేది. మరోపక్క ఆంధ్ర సీఎం రోశయ్య, మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రభృతులు ఏకపక్షంగా బాబుకు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. అయితే ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడంలో టీడీపీ నేతలు విఫలం అయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు.