Telugu Online(TOL)- Andhra Pradesh Political News-July.28.2010:తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయమై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగినవాటిలో ఒక్కటి మినహా మిగిలిన 11 స్థానాల్లో తెలంగాణ ఉద్యమం కోసం పదవులకు రాజీనామా చేసిన సభ్యులే విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలపై పై లగడపాటి టీమ్ ఓ సర్వే నిర్వహించింది. ఏలూరుకు చెందిన ఆర్.జి.ఫ్లాష్ టీం ద్వారా సర్వే నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ సర్వే ఫలితాలను లగడపాటి ఢిల్లీలో వెల్లడించారు. మొత్తం 12 స్థానాలకు గాను 11 చోట్ల రాజీనామాలు చేసిన అభ్యర్థులే గెలుస్తారన్నారు.

తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులు తిరిగి భారీ మెజారిటీతోనే గెలుస్తారని లగడపాటి అన్నారు. మిగిలిన ఆ ఒక్క స్థానంలో కొన్ని కారణాల వల్ల సర్వే చేయలేదని, దాని ఫలితం గురించి ఇపుడు మాట్లాడలేనని తెలిపారు. సర్వే చేయని స్థానం పేరు వెల్లడించరాదనే ఆంక్ష కూడా తనపై ఉందని చెప్పారు. అయితే ఈ స్థానం కచ్చితంగా పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పోటీ చేసిన నిజామాబాద్ అయి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ ఓట్లలో అధికశాతం కాంగ్రెస్‌కే పడ్డాయని చెప్పిన లగడపాటి తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులకు మాట ఇచ్చినమీదట కాంగ్రెస్, వైఎస్ఆర్ అభిమానులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్నారు. దీనివల్ల కాంగ్రెస్‌కు నష్టం తప్పదన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం పోటీ చేసిన ప్రతిచోటా డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో కూడా లగడపాటి ఇలా సర్వే చేయించడం, ఆయన సర్వే అంచనాలు దాదాపు నిజం కావడంతో ఈసారి ఈ సర్వే అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఓడిపోయిన కాంగ్రెస్ ప్రముఖుల విషయమై లగడపాటి ముందే హెచ్చరించారు.