Telugu Online(TOL)- Andhra Pradesh Political News-July.28.2010:ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జగన్ అనారోగ్యానికి గురయ్యారు. షేక్ హ్యాండ్ల కారణంగా చేతిపై అయిన గాయాలు పెరిగిపోవడం, ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన జ్వరపడ్డారు. ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప నుంచి పర్యటనను రద్దు చేసుకుని ముమ్మిడివరంలోని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసంలో కొంతసేపు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం ఉదయం కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం జగన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించింది. తరువాత ముమ్మిడివరం నుంచి యువనేత తిరిగి ఓదార్పు యాత్రను ప్రారంభించి మహిపాల చెరువు మీదుగా కాట్రేనికోన మండలానికి చేరుకున్నారు.

ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకష్ణారెడ్డి , టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. వేలాదిమంది అడుగడుగునా యువనేతకు అఖండ స్వాగతం పలికారు. నాన్న చనిపోయిన తరువాత నాకు అండా..దండా..లేదనుకుని తన వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడు ఓదార్పు యాత్రకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ సాగిస్తున్న ఓదార్పు యాత్ర మంగళవారం 15 రోజులకు చేరింది. యాత్రలో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పల్లంకుర్రులో సోమవారం అర్ధరాత్రి ఆయన వైయస్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.