Telugu Online(TOL)- Interview- May.11.2010:ప్రభాస్ ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించినప్పటికీ వాటిలో విజయం సాధించింన చిత్రాలు రెండే రెండు. ఒకటి "వర్షం" రెండు "ఛత్రపతి". ముచ్చటగా మూడో విజయం అందుకోగలగడం ప్రభాస్‍కు ఎప్పటికప్పుడు అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోతోంది. తాజా చిత్రం "డార్లింగ్" కూడా విజయమనే ద్రాక్షపండును అందివ్వనా వద్దా అని తెగ ఊరిస్తోంది. ఈ నేపధ్యంలో "డార్లింగ్" ను ప్రమోట్ చేయడం కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు.
"డార్లింగ్"ను ప్రస్తుతానికి మినహాయిస్తే.. ప్రభాస్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతున్నప్పటికీ... ప్రతి చిత్రంలోనూ ప్రభాస్ తన పెర్‍ఫార్మెన్స్ ను గణనీయంగా మెరుగు పరుచుకుంటుండడం విశేషం. ముఖ్యంగా "డార్లింగ్" చిత్రంలో ప్రభాస్ ప్రదర్శించిన అభినయం అతని ఫ్యాన్స్ క్లబ్‍లో లెక్కకు మిక్కిలిగా కొత్త సభ్యుల్ని చేర్చుతోంది.
"డార్లింగ్ సినిమాలో ఫస్టాఫ్‍ను ఆడియన్స్ ఎలా రీసీవ్ చేసుకుంటారోనని స్టార్టింగ్‍లో మేమంతా భయపడ్డ మాట వాస్తవమే అయినప్పటికీ.. సినిమా విడుదలయ్యాక ఆ ట్విస్టును ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసి చాలా రిలీఫ్‍గా ఫీలయ్యాం" అంటున్న ప్రభాస్‍తో "తెలుగు ఆన్‍లైన్" ప్రతినిధి ప్రత్యేకంగా ముచ్చటించారు.
"డార్లింగ్"లో మీ పెర్‍ఫార్మెన్స్ ను అందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు. దాని కోసం మీరేమైనా ప్రత్యేకమైన హోమ్ వర్క్ చేసారా ?
ప్రత్యేకమైన హోమ్ వర్క్ అంటూ ఏమీ చేయలేదు. కరుణాకరన్ స్టోరీ లైన్ నేరేషన్ ఇచ్చినప్పుడే నాకు నచ్చి ఓకె చేసాను. ఆ తర్వాత నాలుగైదు నెలలు గ్యాప్ తీసుకుని సీన్ టు సీన్ కళ్లకు కట్టినట్లు చెప్పారు. షూటింగ్ స్టార్టయ్యేలోపు నేను మొత్తం కథను అయిదారు సార్లు విన్నాను. అందువల్ల ఆ క్యారక్టర్‍ను ఓన్ చేసుకోవడం, కరుణాకరన్ సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు క్యారక్టర్ డిమాండ్ మేరకు నటించాను. అదృష్టవశాత్తూ అందరికీ నచ్చుతోంది.
"యాక్షన్ హీరో" అన్న ఇమేజ్ కలిగిన మీరు పూర్తి నిడివి ప్రేమ కథా చిత్రం చేయడం రిస్క్ అవుతుందేమోనని భావించలేదా ?
ఎంతసేపూ యాక్షన్ సినిమాలే చేస్తుంటె.. ఆడియన్స్ బోర్ ఫీలవుతారనే అభిప్రాయంతో "జస్ట్ ఫర్ ఛేంజ్" ఈ ఫుల్ ప్లెడ్జెడ్ లవ్ ఎంటర్‍టైనర్‍ను చేసాను. ఆడియన్స్ వరకూ ఎందుకు చెప్పండి ? నావరకూ నాకే వరసగా యాక్షన్ సినిమాలు చేసి చేసి బోర్ ఫీలవుతున్నాను. అయితే "యాక్షన్ హీరో"గా నాకున్న ఇమేజ్‍కు తగ్గట్లుగానే "డార్లింగ్" చిత్రంలో మంచి ఫైట్స్ కూడా పెట్టాం. బిగినింగ్‍లో వచ్చే ఫైట్‍కు చాలా మంచి అప్లాజ్ కూడా వస్తోంది.
ఈ చిత్రంలో మీ క్యారక్టెర్‍కు "ప్రభాస్" అనే పేరును పెట్టడానికి కారణం ఏమిటి ? నిజ జీవితంలోని ప్రభాస్ ఈ క్యారక్టెర్‍కు ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వలన సినిమాలోని క్యారక్టెర్‍కు "ప్రభాస్" అనే పేరును పెట్టారని భావించవచ్చా ?
అస్సలు భావించకూడదు. ఇందాక చెప్పినట్లుగా ఆ క్యారక్టెర్‍ను నేను ఓన్ చేసుకుని చేసానే తప్ప, మరొకటి కాదు. సినిమాలో నా పాత్రకు "ప్రభాస్" అనే పేరు పెట్టాలనే ఆలోచన పూర్తిగా కరుణాకరన్‍దే. నన్ను వి.వి.వినాయక్ "ప్రభా" అని పిలుస్తుంటారు. ఆ పిలుపు విన్నప్పట్నుంచి కరుణాకరన్ కూడా నన్ను అలా పిలవడం మొదలుపెట్టాడు. చివరికి సినిమాలో క్యారక్టెర్‍కి కూడా "ప్రభాస్" అనే పేరును పెట్టేసి మిగతా క్యారక్టర్లతో "ప్రభా" అని ముద్దుగా పిలిపించాడు. నేను మొదట అభ్యంతరం చెప్పినా.. ఆ క్యారక్టర్‍కు "ప్రభాస్" అనే పేరయితేనే బాగుంటుందని కరుణాకరన్ నన్ను కన్విన్స్ చేయడంతో కాదనలేకపోయాను.
ఇంటర్వెల్ వరకూ సినిమా చూపించి.. "ఇదంతా నిజం కాదు.. హీరో ఊహ మాత్రమే" అని చెప్పడం రిస్క్ అవుతుందేమోనని మీరు భయపడ లేదా ?
చాలా భయపడ్డాం. ఫస్ట్ కరుణాకరన్ కథ చెప్పినప్పుడు క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేసిన నాకు కూడా షూటింగ్ చేస్తున్న కొద్దీ... ఇది జనాలకు ఎక్కుతోందా లేదా అనే అనుమానం వెంటాడడం మొదలైంది. అయితే నేను "ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్" అనే మాటను ఒకటికి రెండు సార్లు గుర్తుకు తెచ్చుకుని ధైర్యంగా ఉండిపోయాను. సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ కూడా ఆ ట్విస్టును ఎంజాయ్ చేస్తున్నారని తెలుసుకుని రిలీఫ్‍గా ఫీలియ్యాం.
సినిమా హిట్టయినట్లేననే నమ్మకం మీకు ఎప్పుడు కలిగింది?
"డార్లింగ్" రిలీజ్ టైమ్ లో నేను వేరే పని మీద ముంబాయిలో ఉన్నాను. అయితే.. నా ఫ్రెండ్స్ మాత్రం అదే రోజు పెద్ద పార్టీ చెసుకున్నారు. నేను లైట్ తీసుకున్నాను. మొదటి రోజు మిస్సయిన మిత్రులు రెండో రోజు పార్టీ చేసుకున్నారు. దానిని కూడా పెద్ద సీరియస్‍గా తీసుకోలేదు. అయితే.. మూడో రోజు కూడా ఇదే తంతు నడవడంతో పాటు... నేను ముంబయి నుంచి వచ్చిన వెంటనే.. నా వెంట పడి.. నేను పార్టీ ఇచ్చేంతవరకు ఊరుకోలేదు. అప్పటికే నాకు కంటిన్యూస్ గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయ్. కాని.. అప్పటికే నాకు పూర్తిగా నమ్మకం కుదరక.. ఆడియన్స్ మధ్యలో కూర్చుని సినిమా చూసాను. ఏ ట్విస్ట్ నైతే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోనని భయపడ్డామో.. ఆ ట్విస్ట్ ను బాగా ఎంజాయ్ చేయడం గమనించాక.. "అమ్మయ్య.. మొత్తానికి చాలా కాలానికి మళ్లీ ఓ సినిమా హిట్టయ్యిందన్నమాట" అనుకున్నాను.
ఈ సినిమాలో మీ కాస్ట్యూమ్స్ చర్చనీయాంశమవుతున్నాయి కదా?
అవును.. "డార్లింగ్"లో నా కాస్ట్యూమ్స్ కొంతమందికి నచ్చితే.. కొంతమందికి నచ్చలేదు. అయితే.. ఈ విధమైన మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుందని ముందే నేను ఊహించాను. ఏదైనా ప్రయోగం చేసినప్పుడు ఇటువంటివి తప్పవు కదా? ఎప్పటిలానే.. టైట్ పేంట్, టైట్ షర్ట్.. లేదా టీ షర్ట్ వేసుకుంటే కచ్చితంగా అందంగా కనిపిస్తాను. కాని.. అందులో నావెల్టి ఏముంటుంది చెప్పండి?
మీ తదుపరి చిత్రాలు ఏమిటి?
ప్రస్తుతం దశరధ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రంలో నటిస్తున్నాను. ఇందులోనూ నాకు జంటగా కాజల్ నటిస్తోంది. ఈ చిత్రం పూర్తయ్యాక.. రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు నిర్మించే చిత్రం ఉంటుంది" అంటూ ఇంటర్వ్యూకు ముగింపు పలికారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్!